Friday, March 5, 2010

అనాథ

"అమ్మాఆఆఆ....!!!"
"ఏమైందిరా..??" ఉల్లిక్కి పడి లేచిన విక్రమ్ అడిగాడు వేణుని...
ఏం జరిగిందో అర్థం కాని వేణు, ఒగురుస్తూ దిక్కులు చూస్తున్నాడు.
"కొంచెం మంచినీళ్ళు తాగు" గ్లాసందించారు ఎవరో.
"పీడ కల వచ్సినట్టుంది.." వెనక ఎవరో అంటున్న మాటలు విక్రమ్ చెవిన పడ్డాయి.
"చిన్న పిల్లాడిలా కల్లో భయపడ్డావా?? హహహః..." ఇంకొకరన్నారు వెనకనుంచి. పిల్లలంతా పగలబడి నవ్వారు.
నవ్వుతున్న వాళ్ళను చూసిన వేణు చిన్నబుచ్చుకుని మెల్లగా దుప్పట్లో దూరాడు. పిల్లలంతా నవ్వుకుంటూ తమ తమ మంచాల వైపు బయలుదేరారు.
రెండు సెకన్లు అక్కడే నిలబడి తరువాత విక్రమ్ కూడా తన మంచం వైపు నడిచాడు.

మర్నాడు.... బెల్ మోగింది,

"ఏరా... రాత్రి ఎందుకలా అరిచావు? పీడకలా?"
"మ్మ్..ఏం? నువ్వెప్పుడూ నిద్దట్లో భయపడలేదా..?"
"మ్మ్.. భయపడ్డాను."
"మరి ఎందుకలా అడుగుతున్నావ్?"
"ఏం లేదు." విక్రమ్ లేచి బాగ్ తీసుకుని క్లాస్ బయటకు నడిచాడు.

****
అబ్బాయిలంతా ఎండలో వరసగా నిలబడ్డారు.
"గోడ దూకి సినిమాకెళ్లిన అబ్బాయిలు సార్" ప్యూన్ వెంకట్రావ్ చెప్పాడు.
అంతా చమటలు కక్కుతూ బిక్క మొహాలేసుకుని చూస్తున్నారు.
"వీళ్ళ parents అందరికీ complaint letters పంపండి." ప్రిన్సిపల్ చురుకుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
కొంత మంది అబ్బాయిలు ఏడవటం మొదలుపెట్టారు. విక్రమ్ కళ్ళలో సన్నని నీటి పొర...

****
"రే.. విక్రమ్, నాకు జాబ్ వచ్చిందిరా! వెంటనే ఇంటికి కాల్ చేయ్యాలి. ఇప్పుడే వస్తా.. అన్నట్టు నిన్న CAT రిసల్ట్స్ వచ్చాయి కదా..ఏమైంది?"
"మ్మ్.. ఇంటర్వ్యూస్ attend అవ్వాలి. IIMs లో రావచ్చు."
"గ్రేట్ రా!! ఇంత లేట్ గానా చెప్పేది?? ఇంటికి కా..."
ఒక్క నిమిషం మౌనం.
"సారీ రా. పొరపాటున..."
"Its ok. చెల్లిని అడిగానని చెప్పు. ఈ సారి రాఖి పంపటం మర్చిపోవద్దని చెప్పు. నేను బయటకెల్తున్నాను. బై."

****
"హలో విక్రమ్, ఏంటి రెండు రోజుల్నుంచి ఫోన్ లేదు?"
"జ్వరం గా ఉంది."
"ఓ..! ఎక్కువ ఉందా?"
"మ్మ్.. 101 ఉంది."
"My GOD! డాక్టర్ దగ్గరకు వెళ్ళావా?"
"లేదు. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది."
"సరే, నుదుటి మీద తడి గుడ్డ పెట్టుకుని పడుకో."
"తడి గుడ్డా?"
"అవును, నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ అలానే చేస్తుంది. తగ్గుతుంది. ట్రై చెయ్యి."
"సరే, ఉంటాను. బై"

****
"తాతయ్యా... అన్నయ్య కొడుతున్నాడు చూడు."
"కొట్టుకోకండర్రా.. అమ్మా శశి.."
"ఆఆ.., ఏంటి తాతయ్య..?"
"అమ్మ ని నా గదిలో కొన్ని మంచినీళ్ళు పెట్టమను తల్లీ"
"సరే తాతయ్య"

మర్నాడు....

నిద్ర లేచిన విక్రమ్ చుట్టూ, అంతా తెల్లగా... అతడికి ఏమీ అర్ధం కాలేదు. ఇంతలో అతడికి ఒక గొంతు వినిపించింది.
"విక్రమ్, నీ ఆయువు తీరింది. తీరని కోరికలతో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి లభించదు. అందువల్ల ఈ లోకం లో ప్రవేశించావు. మళ్ళీ జన్మ ఎత్తే వరకూ నువ్వు ఇక్కడే ఉండవలసి ఉంది."
విక్రమ్ మాట్లాడలేదు. ఇది కలా, నిజమా అన్న అనుమానం లోనే ఉన్నాడు.
"వచ్చే జన్మకు గాను, ఒక కోరిక కోరుకునే అవకాశం నీకు ఇవ్వబడింది. చెప్పు నీకు ఏం కావాలి..?"
విక్రమ్ మాట్లాడలేదు.
"చెప్పు విక్రమ్. నీకు ఇంకొన్ని ఘడియలు మాత్రమే మిగిలాయి. ఇంకొద్ది సేపట్లో నువ్వో తల్లి కడుపున పుట్టబోతున్నావు."
విక్రమ్ మాట్లాడలేదు.
"విక్రమ్?"
"నువ్వెవరో నాకు తెలియదు. ఇది నిజమే అయితే నాకీ అవకాశం ఇచ్చిన నువ్వు భగవంతుడి దూతవి. కాదు కాదు, భగావంతుడివే నేమో!!"
"నేనేవరైతే నీకేం? సమయం మించక ముందే నీకేం కావాలో చెప్పు."
"నాకు అమ్మ కావాలి. 'అమ్మా....,' అని పిలవగానే పలికే అమ్మ కావాలి. నన్ను కడుపులో పెట్టి చూసుకునే అమ్మ కావాలి. నా తప్పులు మన్నించి నన్ను ఎల్లప్పుడూ ప్రేమించే అమ్మ కావాలి. నా కష్టంలో, సుఖంలో, గెలుపులో, ఓటమిలో.. ఎప్పుడూ, ఆమె ఎప్పుడూ నాతోనే ఉండాలి."
తథాస్తు!!

****
"తాతయ్య.. త్వరగా నిద్ర లేఏఏ..! ఈ రోజు స్కూల్ లో డ్రాప్ చెయ్యవా?."
కళ్ళు తెరిచిన విక్రమ్, "ఓహ్..! కలా..!!" అనుకుని లేచి, శశిని దగ్గరకు తీసుకుని నవ్వుతూ ఏదో చెప్పబోయి, మంచం మీద అలానే ఒరిగిపోయాడు.
"తాతయ్య, తాతయ్యా.....!!"
"సారీ అఖిల్, మీ నాన్న గారు చనిపోయి 30 minutes అయ్యింది."


****
"Congratulations, మగపిల్లాడు పుట్టాడు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మీ వైఫ్ స్పృహలోకి వచ్చారు. మీరు లోపలికెళ్ళి చూడచ్చు."
"థాంక్స్ డాక్టర్ గారు."
"స్వాతి, are you ok?"
"మ్మ్.. I am fine."
"ఏం పేరు పెడదాం ఈ లిటిల్ రాస్కెల్ కి..?"
బాబును గుండెలకు అద్దుకుంటూ తన్మయత్వంతో స్వాతి చెప్పింది, "విక్రమ్"

****

No comments: