Thursday, March 11, 2010

ఉన్నట్టా? లేనట్టా???

వెన్నెల వదిలి పోయింది,
చుక్కలు రావద్దు అంటున్నాయి.
చీకటి రక్కసి తరిమి తరిమి,
ఒంటరి ఊబిలోకి తోసేసింది.
అందాకా ప్రవాహమై పారిన కన్నీరు,
అంతలోనే ఇంకిపోయింది.
నిర్జీవంగా మిగిలిన దేహాన్ని,
నిశ్శబ్ధం నమిలి నుజ్జు నుజ్జు చేస్తుంది.
అచేతనంగా దీర్ఘ నిద్ర లో ఉన్నాయా అన్నట్టున్న కన్నుల్లో,
ఆ శబ్ధం వినగానే.., చలనం!!
ఎవరూ లేరన్న వాటి నమ్మకాన్ని సవాల్ చేస్తూ, వినబడిన ఆకుల రవళికి మేల్కొని,
సంభ్రమాశ్చర్యాలను నింపుకుని, ఆశల దివ్వెను వెలిగించి గాలిస్తున్నాయి.........
"ఎవరా??!" అని.

వాటి పిచ్చి కానీ,
ఊపిరి సలపని ఆ కిక్కిరిసిన అరలో గాలెక్కడిది?!
మొలకైనా అసాధ్యమైన ఆ మైదానం లో ఆకులెక్కడివీ??!!
అసలు గాలించేందుకు ఎంత చోటుందనీ???
నిజమే! ఎంత??
గమ్మత్తు!!
లేదనుకుంటే, ముడిచిన గుప్పెడంత... చిన్నగా, ఇరుగ్గా....
ఉందనుకుంటే విశ్వమంత... విశాలంగా, వైభోగంగా!!

ఇంతకీ ఉన్నట్టా? లేనట్టా???
ఎహే..! ఉందనుకుంటే పోలా!! :P

1 comment:

మురారి said...

>>నిర్జీవంగా మిగిలిన దేహాన్ని నిశ్శబ్ధం నమిలి నుజ్జు నుజ్జు చేస్తుంది.
నిశ్శబ్దపు క్రూరత్వాన్ని చాలా కరకుగా చెప్పారు. ఇలాంటి తీవ్రమైన భావావేశం మీ టపాల్లో ఒడుపుగా కంటపడుతుంటుంది. ఇది మీకే ప్రత్యేకమనిపిస్తుంది.

end చేసిన విధానం నాకు అంతగా రుచించలేదు. పలచన అయ్యింది. ఆ రెండు లైన్లని exclude చేసినా బానే ఉంటుంది.