Tuesday, March 30, 2010

..శారదామృతం..

రద్దీ బస్సు... ఒక అమ్మాయి సీట్ లోంచి లేచి తన ఒళ్ళో కూర్చున్న పాపను సీట్ లో కూర్చో పెట్టీ బాయ్ చెప్తుంది. వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు నాకు, మాటలు అర్ధం కావటం లేదు. పాప ముఖం కనిపించలేదు కానీ తల కనిపుస్తుంది. ఆ పాప తలని అడ్డం గా ఊపేస్తుంది. "అక్క ని వెళ్ళొద్దంటోంది కాబోలు" అనుకున్నా నేను. తన మాట వినకుండా బస్ దిగిపోతున్న అక్కని చూపిస్తూ వెనక సీట్ లో కుర్చున్న అమ్మకి ఏదో చెప్పేస్తుంది, చాలా హడావుడిగా.... గోల చెయ్యొద్దని అమ్మ సైగ చేయటంతో ఊరుకుంది. కానీ ఇంకా బస్ డోర్ వైపే చూస్తుంది. ఆ స్టాప్ నుండి బస్ కదిలిన వెంటనే పాప సీట్ లోంచి దిగి ముందు సీట్ లో ఫోన్ లో బిజీగా ఉన్న ఆంటీ ని పలకరిస్తుంది. అప్పుడు ఆ పాపకు అర అడుగు దూరం లో ఉన్నాను నేను. లేత గులాబి రంగు స్లివ్ లెస్ గౌను, రంగు రంగు ల బూట్లు, రెండు చిన్న చిన్న పిలకలు, మెరుస్తున్న కళ్ళు, ఇట్టే ఆకట్టుకునే ముఖ కవళికలు, హావ భావాలు.... దగ్గరగా వచ్చిన ఆ సీతకోక చిలుకను, చిట్టి వింతను కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాను. తాను చేసిన బొమ్మకి ఒక్క మచ్చైనా పెట్టకపోతే తన మనసు[విధి] ఒప్పదేమో ఆ పైవాడికి!! ఈ బొమ్మ మూగది. చివుక్కుమంది ఒక్కసారిగా... ఆ ఒక్క సెకనులో ఎంత వికారంగా నలిగిపోయి, కృశించి, ఏడ్చిందో మనసు.. తిట్ల దండకం మొదలు పెట్టాను. ఈ లోగా ఆ పాప పైకి మళ్ళింది ధ్యాస, మళ్ళీ! ఒకటో వరసలో ఉన్న ఆంటీ, మూడో వరుసలో ఉన్న అమ్మ మధ్య వెయ్యి పచార్లు, కబుర్లు, ఫిర్యాదులు[ఆంటీ ఫోన్ లో మాటాడేస్తుందట], ఆంటీ కి ఫోన్ పెట్టెయ్యమని వార్నింగ్ లు.... పిలకలు లాగిన కుర్రాళ్ళని చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ.. తట్టి దాగుడుమూతలాడుతున్న వాళ్ళని చిన్నగా కొట్టి మందలిస్తూ, మరీ..ఈ... మాట వినకపోతే నాలిక కరిచి-కళ్ళెర్ర చేసి భయపెడుతూ చుట్టూ ఉన్నవారికి ఎన్నో మధురమైన నిముషాలు కానుకగా ఇచ్చింది. అలా భయపడ్డవాళ్ళలో 'నేనూ ఉన్నా..' అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు దగ్గరగా వచ్చినప్పుడు తనని తట్టానని, నన్ను బెదిరించి ఏదో సైగ చేసింది. ఆ సైగలు అర్ధం కాలేదు, నేను నవ్వుకున్నాను. ఆ పావుగంట ప్రయాణం లో ఆ పిల్ల చుట్టూ ఉన్న వారందరినీ, కనీసం 30 మందిని, తన చేష్ఠలతో ఆకట్టుకుంది, అలరించింది. అంతలో ఒక అబ్బాయి చేతిలో ఉన్న ఫోల్డర్ ని చూపించి, 'ఇది ఏమిటి?' అన్నట్టు సైగ చేసింది. 'ఫోల్డర్' అన్నాడతను. అర్ధం కాలేదనుకుంట, అమ్మ వైపు తిరిగింది. అమ్మ పెదాల కదలిక అర్ధమయ్యేలా చెప్పింది. పాప అర్ధమైనట్టు తలూపింది. భగవంతుడా...! ఆ పాప చెవిటిది కూడా...!! చాలా సందర్భాల్లో ఈ రెండు లోపాలు కలిపే ఉంటాయని తెలుసు. మూగ, చెవిటి వారిని ఇంతకు ముందు నేను చూసాను కూడా. కానీ ఆ పాపను చూసి ఎందుకో గుండెల్లో కలుక్కుమంటోంది. ఆ పాప పేరు తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఏదో మూల భయం! చేదు జ్ఞాపకం గా మిగులుతుందేమో అని... లాస్ట్ స్టాప్ వచ్చేసింది. ఆఖరుకి అడిగెయ్యాలని నిశ్చయించుకుని, బస్ దిగి వాళ్ళ కోసం నిల్చున్నా. వాళ్ళు కూడా బస్ దిగారు. పాప అమ్మ ను అడిగాను, 'ఏం పేరు?'

'శారద' అన్నారావిడ.
ఇంకెన్ని తూట్లు పొడుస్తావు భగవంతుడా.... ! :(((( అనిపించింది మనసులో..
'ఇందాక మీ దగ్గరకొచ్చినప్పుడు మిమ్మల్ని పేరు అడిగింది. మీకు అర్ధం కాలేదు' అని నవ్వారు ఆవిడ. ఏమని స్పందించాలి నేను?? చిన్నగా నవ్వాను.

వాళ్ళు వెళ్ళిపోయారు. రెండు సెకన్ల తరువాత నేను కూడా కదిలాను.
ఐతే, 'ఒక్క ఫోటో తీసుకుందాం' అన్న ఆలోచన రానివ్వని నా మొహమాటానికి, సంశయానికి నన్ను నేనే.. తిట్టుకుంటూనే ఉన్నాను ఆ రోజంతా.

సుమారు ఒక నెల తరువాత....
ఆ శారదా దేవి నన్ను ఈ రోజు కరుణించింది, అనుకోకుండా... :)

లేట్ అయిపోయిందని ఉరుకుల పరుగుల మీద బస్టాప్ కి వచ్చి, మొదటి బస్ రద్దీ గా ఉండటంతో వెనకే వచ్చిన ఇంకో బస్ ఎక్కి సీటు ఖాళీ లేనందువల్ల నిల్చున్న నేను, ఆమె చేసిన అలికిడి విని, ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కు తిరిగాను. స్కూల్ యూనీఫాం లో శారద! ఎప్పటిలాగే చిరునవ్వుతో... ఎవరో తెలీని అన్నయ్యతో సీటు షేరింగ్. వాడి భుజం మీద చాలా చనువుగా వాలిపోతూ, మధ్య మధ్యలో ఇరుగ్గా ఉందని వాడి మొహం మీద చెయ్యి పెట్టి నిష్ఠూరమాడుతూ.. హహహా.... నా పంట పండింది. ఈ అవకాశం జారవిడుచుకోను. ఇంత ముందులా ఆలస్యం చెయ్యకుండా మొబైల్ లో కెమెరా ఆన్ చేసాను. కానీ, 'ఫోటో తీసుకుంటా' అని అడిగితే వాళ్ళ అమ్మ ఏమంటారో! అసలు ఎమనుకుంటారో!' అని భయమేసింది. ఒక వేళ అడిగాక కాదంటే? దొంగతనంగా తీసే అవకాశం కూడా పోతుందేమో అని.. చెప్పకుండా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసాను. నా ధౌర్భాగ్యమో, లేక ఉన్నంతలో తృప్తి పడమనో మరి, 'battery low' అంటూ సెల్ సైగ చేసింది. దాని మాట వినక తప్పలేదు. సెల్ ని బాగ్ లో పడేసి, బస్ లో రాడ్ కు వెలాడుతూ ఆ శారదామృతాన్ని సేవిస్తూ మిగతా ప్రయాణం కొనసాగించాను.

'మళ్ళెప్పుడొస్తుందో.......' :)

5 comments:

భావన said...

సొ నైస్ అండి విడియోలు. అవును భగవంతుడు చిత్రమైన వాడు. I am sure she will be fine and successful in her life.

madhu said...

మోహన గారూ,
మీరు రాసిన విధానం బాగుంది. కొన్ని నిమిషాలు మనసు కలుక్కుమన్నది.
మీరు ఇలా ఆ పాప తల్లిగారి పర్మిషన్ లేకుండా, ఆ పాప వీదిఒస్ తీయటమే కాక, పబ్లిక్ ప్రోపెర్తి లా, బ్లాగ్ లో పోస్ట్ చేయటం ఒక్కటే అంత సమంజసంగా లేదేమో, కొంచెం ఆలోచించండి.

మోహన said...

@భావన
నా ఆశ, నమ్మకం కూడా అదే. Thank you.

@madhu
నిజమే. సమంజసం కాదు. శారద జ్ఞాపాకాన్ని నేను పోగుచేసుకోగాలిగాను, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే క్షణికావేశమో, ఆనందమో.. నన్ను ఆ పని చేసేలా చేసాయేమో! అంతే కానీ ఆమె పబ్లిక్ ప్రోపర్టీ అన్న భావన అస్సలు లేదు. నా ఈ చర్య వెనుక ప్రేమే తప్ప, ఎలాంటి దురుద్దేశం లేదు.

మీ సూచనను ధ్యాసలో ఉంచి, విడియోలు తొలగించాను. ధన్యవాదాలు.

madhu said...

మోహన గారూ,
చిన్న సవరణ. నా ఉద్దేశం, ఆ వీడియోస్ పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా పెట్టారు అనే కానీ, ఆ చిన్నారిని మీరు అలా అనుకున్నారు అని కాదు.గూగుల్ వీడియోస్ నుంచి కూడా తీశేసారని తలుస్తాను.

రేపు మన పిల్లలు ముద్దుగా ఉన్నారనో,బొద్దు అనో, మరొకటనో, ఎవరో ఇలా బ్లాగ్స్ లో పెడితే మనం చూసి బాధ పడతాము కదా, సడుద్దేసమైనా అవి ఆ పాప తల్లి గారి పర్మిషన్ లేకుండా తీసినవి, అదీ తప్పే అయినా,అంత మంచి పాప గుర్తులు పోకూదడనే మీ ఉద్దేశం అర్థం అయ్యింది. పోనీ మీ ఆనందం కోసం ఉంచుకోకుండా, ఇలా నలుగుర్లో పెట్టడం ఇంకా తప్పనిపించి చెప్పాను.

ఏదేమైనా, అర్థం చేసుకుని తీసి వేసినందుకు ధన్యవాదాలు. అర్థం చేసుకున్న మీ మంచి మనసు అభినందనీయం.

అన్నట్టు నేను చదువుకునే రోజుల్లో మా హాస్టల్ పక్కన అంధుల హాస్టల్ ఉండేది.ఒకాయన, అప్పటికి ఆయనకీ పాతిక ఏళ్ళు ఉంటాయేమో, ఏ సంకోచం లేకుండా రోడ్ దాతేవారు, కర్ర సహాయంతో. కొన్ని రోజులు, నేను, ఆయన పక్క పక్కనే మాటలు లేకుండా నడిచాం.మాట్లాడదాం అనుకుంటే మనసు భారం అయ్యేది.ఆయనే నా చెప్పుల సౌండ్ బట్టి రోజూ నేనే అని గుర్తించి, పలకరించారు. మెల్లిగా పరిచయం అయింది.ఆయన మాటలు, జాలిని కాక, కేవలం స్నేహాన్ని ఆశించే ఆ ఆత్మ విశ్వాసం, నిర్మల వ్యక్తిత్వం,నాకు ఎప్పటికీ గుర్తుంటాయి.కొన్ని రోజుల తర్వాతే ఆయనకీ వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది.మా స్నేహం ముగిసింది. మీరు ఈ పాప గురించి రాసి, ఆయన జ్ఞాపకాలని తట్టి లేపారు.ఆయన ఎలా ఉంటారో గుర్తు లేదు, కానీ ఆ జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోదు.

Kranthi said...

Really heart-touching post. really good one. went through emotional ride during reading .