నిన్ను మురిపించాలనో, నువ్వొచ్చే దాకా నన్ను ఏమార్చుకోవాలనో మరి,
దగ్గర గానే దూరం దూరం గా, చిన్నగా...
వరస తప్పిపోకుండా, పొందిగ్గా...
లెక్కేస్తూ పెడుతున్నాను చుక్కలు.
ఒక్కో చుక్కతో నీతో ముడిపడిన ఒక్కో సన్నివేశం గుండెల్లో సున్నితంగా గుచ్చుకుంటుంది.
మదిలో ఉప్పొంగుతున్న అనురాగం పాటై పెదవిని చేరి, వేళ్ళలోంచి ముగ్గులా రాలుతోంది.
పూర్తయ్యాకా రంగులు నింపేదా?, కళ్ళకు ఇంపుగా ఉంటుంది.
లేక పూలు పరిచేదా?!! కాళ్ళ కింద నలిగిపోతాయేమో!
పొనీ ఏ అర్భాటాలు లేకుండా ఇలానే ఉండనిస్తే? నచ్చుతుందా?!
ఇంతలో చిట-పట అంటూ మేఘం,
ముంగిలిలో చుక్కలు పెట్టేసి, చక చకా ముగ్గేసేసింది.
ప్రేమతో గీసిందా అన్నట్టుంది ఆమె గీసిన ముగ్గు.
గడప దగ్గర కూర్చుని చూస్తున్నాను నేను.
3 comments:
bagumdi nice
beautiful, as usual.
>>నిన్ను మురిపించాలనో, నువ్వొచ్చే దాకా నన్ను ఏమార్చుకోవాలనో మరి..
నిజమే కదా!.. ఇలాంటి సందిగ్ధత ఇష్టపడినవారి పట్ల కలుగుతూ ఉంటుంది.
>>ఒక్కో చుక్కతో నీతో ముడిపడిన ఒక్కో సన్నివేశం గుండెల్లో సున్నితంగా గుచ్చుకుంటుంది.
ఎంత చక్కని భావనో!!..
హృద్యమైన టపా.. హత్తుకుంది.
Post a Comment